← Back to headlines

కాంగ్రెస్.. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు : రాకేష్ రెడ్డి

2026-05-08 11:03 • original

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆరోపించారు. రెండున్నరేళ్లయినా ఇంత వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరుతో 34 హామీలిచ్చాడని, ఇదే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతు సంగ్రామ సదస్సు పెడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహుల పైన విరోచితంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పోరాడారని తెలియజేశారు. కాంగ్రెస్ రైతు మేళాలో కనీసం 2వేల మంది రైతులు కూడా పాల్గొనలేదని, అక్కసుతో కెటిఆర్ మీద కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, రైతు రుణమాఫీ సంపూర్ణంగా చెయ్యలేదని మండిపడ్డారు.

ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, రెండు ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు యూరియా ఇవ్వడం లేదని, షాపుల్లో ఉండాల్సిన యూరియా యాప్ ల్లోకి వచ్చిందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులు గోస పడుతున్నారని, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సిగ్గుంటే ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లైలో రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద స్కామ్ అని హైకోర్టు ప్రభుత్వానికి, మిల్లర్లకు నోటీసులు పంపిందని, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు, కష్టాలు వస్తాయని మాజీ సిఎం కెసిఆర్ ఆనాడే చెప్పారని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.