← Back to headlines

మూడేండ్ల గరిష్టానికి ప్రపంచ ఆహార ధరలు

2026-05-08 23:02 • original

ఇరాన్ యుద్ధం సెగ
న్యూఢిల్లీ/రోమ్: ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన తీవ్ర అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గత మూడు ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ఆహార ధరల సూచీ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఈ సూచీ 1.6 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.5 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో రాకపోకలు నిలిచిపోవడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిందని యుఎన్‌ ‌రిపోర్ట్‌ ‌పేర్కొంది. ముఖ్యంగా డీజిల్, ఎరువుల వంటి అత్యవసర ఉత్పాదకాల సరఫరా తగ్గిపోవడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావం నేరుగా ఆహార వస్తువులపై పడింది. ఏప్రిల్ నెలలో వంట నూనెలు ధరలు ఏకంగా 5.9 శాతం పెరిగి జులై 2022 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల బయో ఫ్యూయల్స్ కు గిరాకీ పెరిగి, అది వంట నూనెల మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తోందని ఎఫ్‌ఎఒ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో విశ్లేషించారు.​
రికార్డు స్థాయికి మాంసం, ధాన్యాల ధరలు
కేవలం నూనెలే కాకుండా మాంసం, ధాన్యాల ధరలు కూడా భారీగా పెరిగాయి. మాంసం ధరల సూచీ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకోగా, ధాన్యాల ధరలు 0.8 శాతం పెరిగాయి. యుద్ధం కారణంగా ఎరువుల కొరత తలెత్తడంతో 2026 నాటికి గోధుమల సాగు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, రొమేనియా వంటి ఐరోపా దేశాల రైతులు అధిక పెట్టుబడి ఖర్చుల కారణంగా మొక్కజొన్న సాగును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు నెలలుగా ఆహార ధరల సూచీ పెరుగుతూ రావడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త సవాలుగా మారింది.​

The post మూడేండ్ల గరిష్టానికి ప్రపంచ ఆహార ధరలు appeared first on Navatelangana.