← Back to headlines

నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్‌ సర్కార్‌ ధోరణులు

2026-05-08 17:33 • original

దేశంలో కార్మిక వర్గం నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం సాధారణ ఆర్థిక సమస్య కాదు. అది పాలక వర్గాల విధానాల వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్న సామాజిక-ఆర్థిక సంక్షోభం. వేతన స్తంభన, పనిగంటల పెంపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఒప్పంద కార్మిక వ్యవస్థ విస్తరణ, ఉద్యోగ భద్రత లేకపోవడం-ఈ నాలుగు అంశాలు కలిసి కార్మికుల జీవితాలను అస్తిరత్వంలోకి నెట్టేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవల జరిగిన కార్మిక నిరసనలు వారి సమస్యలన్నింటినీ వెలుగులోకి తెచ్చాయి.నోయిడా, ఫరీదాబాద్ వంటి పారిశ్రామిక కేంద్రాలు దేశ అభివృద్ధికి ప్రతీకలుగా చూపబడుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి నమూనా లోపలికి వెళ్లి చూస్తే, అది కార్మికులపై అసమానతల నిర్మాణమని స్పష్టమవుతోంది. సంపద సృష్టి పెరుగుతున్నా, ఆ సంపదలో కార్మికుల వాటా అనగా వారి కుటుంబాల జీవనానికి సరిపడా వేతనం తగ్గిపోతోంది.కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా తీసుకోగలమనే వాదన ఉంది.

కానీ అదే పరిస్థితి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎందుకు కనిపించడంలేదు? ఇదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్న, చర్చ. వాస్తవానికి “డబుల్ ఇంజిన్” అనేది అభివృద్ధిని వేగవంతం చేసే యంత్రంగా కాకుండా, కార్పొరేట్ ప్రయోజనాలను వేగంగా అమలు చేసే విధానంగా మారిందనే విమర్శలు బలపడుతున్నాయి.మొదట కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో ఈ డబుల్ ఇంజన్ సర్కార్లు పూర్తిగా విఫలమయ్యాయి. ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుండగా, కనీస వేతనాలు తగిన విధంగా సవరించబడటం లేదు. ఫలితంగా, నిజ వేతనాలు క్షీణిస్తున్నాయి. ఒకవైపు కంపెనీల లాభాలు పెరుగుతుంటే, మరోవైపు కార్మికుడు తన కుటుంబాన్ని పోషించడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఇది కేవలం ఆర్థిక అసమానత మాత్రమే కాదు, ఇది సామాజిక అన్యాయం. రోజుకు కార్మికులు పది నుంచి పన్నెండు గంటలు పని చేస్తున్నా కూడా డబుల్ ఇంజన్ సర్కార్‌‌కు కార్మిక శాఖ అధికారులకు, పట్టడం లేదు.

అదే చట్టం అని భావిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. రెండవది, ఒప్పంద కార్మిక వ్యవస్థను నియంత్రించాల్సిన చోట, దాన్ని మరింత ప్రోత్సహించడం జరుగుతోంది. భారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను నియమించడం సర్వ సాధారణమైంది. దీనివల్ల యజమానులు బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారు. కార్మికుడు ఏ క్షణమైనా ఉద్యోగం కోల్పోయే భయంతో జీవించాల్సి వస్తోంది. ఈ అస్థిరతే నోయిడా కార్మికుల ఆందోళనల వెనుక ప్రధాన కారణం.ఇంకా కార్మిక హక్కులను రక్షించే చట్టాలను బలహీనపరచడం. కొత్త లేబర్ కోడ్స్ ద్వారా సమ్మె హక్కుపై పరిమితులు, కార్మికుల తొలగింపులపై సడలింపులు, యూనియన్లపై నియంత్రణలు, పెరిగాయి. ప్రభుత్వం వీటిని గొప్ప “సంస్కరణలు”గా ప్రచారం చేసుకుంటున్నది కానీ, కార్మికుల దృష్టిలో ఇది వారి హక్కుల ను కాలరాయడమే. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన స్థానం లో కార్మికులను వారి ఆందోళనలను అణచివేయడం అనేది పాలకుల నియంతృత్వ ధోరణి కి అద్దం పడుతోంది.

నోయిడాలో జరిగిన నిరసనలను ప్రభుత్వం “లా అండ్ ఆర్డర్” సమస్యగా చూడటం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ‘ఇండస్ట్రియల్ పీస్’ పేరిట ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, కార్మికులపై కేసులు పెట్టడం, నాయకులను నిర్బంధించడం-ఇవి అన్నీ సమస్యను పరిష్కరించడానికి కాదు, దాన్ని నొక్కిపెట్టడానికి అణచి వేయడానికి తీసుకున్న చర్యలు. ఇది తాత్కాలికంగా శాంతి కలిగించినా, దీర్ఘకాలంలో అసంతృప్తిని మరింత పెంచుతుంది.నిరసనలకు బాహ్యశక్తులు కారణమని ఆరోపించడం ద్వారా బాధ్యత ల నుంచి తప్పించుకునే రాజకీయ వ్యూహం, అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడం జరుగుతోంది. పాకిస్తాన్, “అర్బన్ నక్సల్స్” వంటి పదజాలం ఉపయోగించడం ద్వారా కార్మికుల అసంతృప్తిని దేశద్రోహంతో ముడిపెట్టే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య చర్చలను బలహీనపరచడమే కాకుండా, సమస్యల పరిష్కారానికి అవరోధంగా మారుతోంది.

ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే, “డబుల్ ఇంజిన్” సర్కార్ల అభివృద్ధి నమూనా ఒకపక్షపాతంగా , నియంతృత్వ వైఖరిగా ఉందని స్పష్టమవుతోంది. ఇది పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు అనుకూలంగా ఉండి, కార్మికుల అవసరాలను, వారి న్యాయమైన సమస్యలను పక్కనబెడుతోంది. అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం కాదు, ఆ అభివృద్ధి ఫలాలు సమానంగా పంచబడితేనే అది స్థిరంగా ఉంటుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తమ విధానాలను పునః సమీక్షించుకోవడం, ఆవిధానాలను రద్దు చేసుకోవలసిన అత్యవసరం ఉంది. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత,పని గంటల పెంపు, ఒప్పంద వ్యవస్థ నియంత్రణ, సామాజిక భద్రతా పథకాల విస్తరణ-ఇవి కేవలం ఆర్థిక చర్యలు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వానికి అవసరమైన పెట్టుబడులు. కార్మికుల అసంతృప్తిని నిలువరించడం ద్వారా అణచివేయడం ద్వారా కాకుండా, పరిష్కరించడం ద్వారానే దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుంది.

-ఎఆర్‌ఎ ప్రసాద్‌, 9490300867

The post నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్‌ సర్కార్‌ ధోరణులు appeared first on Navatelangana.