← Back to headlines

రాష్ట్రంలో కామన్ గుడ్ ఫండ్ కింద 706 ఆలయాలు మంజూరు చేశాం : ఆనం

2026-05-12 11:33 • original

అమరావతి: బుధవారం గండి క్షేత్రం మఠాధిపతుల సమక్షంలో సంప్రోక్షణ, కలశాభిషేకం జరుతుందని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గండి క్షేత్రాన్ని రూ.28 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. గండి క్షేత్రానికి ఏటా రూ. 5.62 కోట్ల ఆదాయం వస్తోందని, ఇప్పటికే రూ. 9.47 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని తెలియజేశారు. కామన్ గుడ్ ఫండ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరు చేశామని, రూ.832 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద 6,170 ఆలయాలకు ఆర్థిక ఊతం ఇచ్చారని, ప్రతి ఆలయానికి నెలకు రూ.10 వేల చొప్పున ధూపదీప నైవేద్య నిధులు సమకూరాయని ఆనం పేర్కొన్నారు.

అర్చకుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా రూ. 74.04 కోట్ల నిధులు సమకూరాయని, రాష్ట్రంలో 679 భజన మందిరాల నిర్మాణానికి రూ. 113.25 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. కొత్తగా 5వేల భజన మందిరాల కోసం ప్రభుత్వం రూ. 750 కోట్లు మంజూరు అయ్యాయని, టిటిడి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25-35 ఆలయాల నిర్మాణం జరిగిందని అన్నారు. భూమి లభ్యత మేరకు ఆలయాలకు రూ. 20-40 లక్షల నిధులు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 956 ఆలయాలకు ధర్మకర్తల మండలి నియామకం జరిగిందని అన్నారు. నివేదికలు అందిన వెంటనే జిల్లాలోని మరిన్ని ఆలయాలకు నిధులు చెల్లిస్తామని, ఆలయ కమిట్లీల్లో ఛైర్మన్లను నియమించి సేవలు మెరుగుపరుస్తామని ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు.