← Back to headlines

నీట్- పరీక్ష రద్దు.. పేపర్ లీక్ ఆరోపణలపై సిబిఐ విచారణ

2026-05-12 13:13 • original

 జాతీయ అర్హత పరీక్ష (నీట్ యూజీ2026)కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మళ్లీ కొత్త తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్త పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తామని తెలిపారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో, విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకు, పారదర్శకతను నిలబెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుని పరిశీలించిన సమాచారంతో పాటు, చట్ట సంస్థలు పంచుకున్న దర్యాప్తు వివరాల ఆధారంగా మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ అనుమతితో నిర్ణయించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ ఏడాది నీట్-యూజీ పరీక్ష దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు. చట్ట అమలు సంస్థల నుంచి అందిన సమాచారం, దర్యాప్తు సంస్థల నివేదికలను సమగ్రంగా పరిశీలించిన తరువాత ప్రస్తుతం నిర్వహించిన పరీక్షా ప్రక్రియను కొనసాగించడం సాధ్యం కాదని తేలినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. మళ్లీ నిర్వహించే పరీక్ష తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల విడుదల షెడ్యూల్‌ను త్వరలో అధికారిక మార్గాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది,


ఇక ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. దర్యాప్తుకు అవసరమైన అన్ని రికార్డులు, పత్రాలు, సహాయాన్ని సీబీఐకి పూర్తిగా అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది. జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని పరిరక్షించడం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) తెలిపింది.పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు నిజమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని అంగీకరించిన ఎన్‌టీఏ, అయితే పరీక్షా వ్యవస్థపై నమ్మకానికి దీర్ఘకాలిక నష్టం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని పేర్కొంది. కొత్తగా పరీక్ష రాసేందుకు విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కరలేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తరువాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌టీఎ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఆదివారం ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రశ్నాపత్రాలను ప్రత్యేక వాటర్‌మార్క్ గుర్తింపులతో కూడిన జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల్లో తరలించినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. అలాగే పరీక్షా కేంద్రాలను కేంద్ర నియంత్రణ గది నుంచి ఏఐ సహకారంతో పనిచేసే సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది.నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) చేపట్టిన చర్యలపై వచ్చిన వార్తల గురించి తమకు తెలుసని ఎన్‌టీఏ పేర్కొంది. మే 3న పరీక్ష పూర్తి భద్రతా వ్యవస్థ మధ్య యథావిధిగా నిర్వహించామని తెలిపింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తరువాత, మే 7, సాయంత్రం అవకతవకలకు సంబంధించిన సమాచారం అందిందని, మే 8 ఉదయం వాటిని స్వతంత్ర ధృవీకరణ, తదుపరి చర్యల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇందులోని సమాచారం.. నీట్ ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ ప్రాక్టీసు పేపర్ కేరళలోని ఒక వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని.. ఆ తరువాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్‌వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతోన్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు.

దీన్ని విద్యార్థులకు రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల ననుంచి ముందుగానే రూ. 30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామని రాజస్థాన్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశామని బన్సాల్ తెలిపారు.