← Back to headlines

రెండు లారీలో ఢీ.. ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం

2026-05-12 17:18 • original

తిరుమలాయపాలెం మండలం మేకలతండా శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో వరంగల్‌ ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపేడ బంగ్లా నుంచి ఖమ్మం నగరానికి వస్తున్న ఆలుగడ్డ లోడ్ లారీ, విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు బొగ్గు లోడ్‌తో వస్తున్న లారీని ఏకలవ్య నర్సరీ సమీపంలో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు లారీలు అతివేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించించింది. లారీలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో క్యాబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్లు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

లారీలో బొగ్గు ఉండటం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లకు స్వల్పగాయాలు కాగా, వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం కారణంగా కొంతసేపు వరంగల్‌ఖమ్మం రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బొగ్గు లారీడ్రైవర్ నందిగామ గ్రామానికి చెందిన వేణుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.