← Back to headlines

పోలీసుల ఎదుట లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి

2026-05-12 17:40 • original

మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నాలుగు దశాబ్దాలుగా అడవుల్లో గెరిల్లా పోరాటం నడిపిన అగ్రనేత సరెండర్ కావడం మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతున్నది. కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి విద్యార్థి దశలోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన ప్రయాణం క్రమంగా కేంద్రకమిటీ స్థాయికి చేరింది. జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఆయన భార్య కూడా పార్టీలో ముఖ్య బాధ్యతల్లో ఉన్నారు.

ఇటీవల జార్ఖండ్ సరండా అడవుల్లో భద్రత బలగాలు ముమ్మర కూంబింగ్ చేపట్టాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాను లక్షంగా చేసుకుని సాగుతున్న ఆపరేషన్లతో మావోయిస్టు శ్రేణులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో నరహరి దంపతులు లొంగుబాటు నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తల్లో, వ్యూహకర్తల్లో ఒకరిగా పేరున్న నరహరి లొంగిపోవడం తెలంగాణ, జార్ఖండ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.