ఏప్రిల్‌లో పెరిగిన థాలీ ఖర్చులు క్రిసిల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశంలో సామాన్యుడి ప్లేట్ భోజనం (థాలీ) ఖరీదు ఏప్రిల్ నెలలో మరింత ప్రియమైంది. టమాటా, వంట నూనెలు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో ఇంట్లో వండుకునే శాఖాహార, మాంసాహార థాలీల సగటు ఖర్చు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 2శాతం పెరిగిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల టమాటా ఉత్పత్తి 3 నుంచి 4 శాతం క్షీణించింది. దీని ప్రభావంతో ఏప్రిల్ 2026లో టమాటా ధర ఏడాది ప్రాతిపదికన 38 శాతం పెరిగి కిలో రూ.29కి చేరింది. అదే విధంగా ప్రపంచవ్యాప్త సరఫరా ఆటంకాల వల్ల వంట నూనెలు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు కూడా7 శాతం మేర పెరిగాయి. ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాల ధరలు తగ్గడం వల్ల థాలీ ధరలు మరీ భారీగా పెరగకుండా కొంత ఉపశమనం లభించింది. ఆలస్యంగా ఖరీఫ్, రబీ పంటలు ఒకేసారి మార్కెట్‌లోకి రావడం, ఎగుమతులు తగ్గడంతో ఉల్లి ధరలు ఏడాది ప్రాతిపదికన 16 శాతం తగ్గాయి. రబీ దిగుబడి పెరగడంతో బంగాళదుంప ధరలు కూడా 14 శాతం తగ్గుముఖం పట్టాయి. వేసవి తాపం వల్ల కోళ్ల మరణాలు పెరిగి బ్రాయిలర్ చికెన్ ధరలు 2 శాతం పెరగడం మాంసాహార థాలీ ధరపై ప్రభావం చూపింది.రానున్న రోజుల్లో ఉల్లి సాగు తగ్గనుండటం, కోల్డ్ స్టోరేజీల నుంచి నిల్వలు బయటకు రావాల్సి ఉండటంతో ఉల్లి, బంగాళదుంప ధరలు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ హెచ్చరించింది. అలాగే జులై-ఆగస్టు నెలల్లో ఎండతీవ్రత, తక్కువ సాగు కారణంగా టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. నెలవారీ ప్రాతిపదికన చూస్తే శాఖాహార థాలీ ధరలో మార్పు లేనప్పటికీ, మాంసాహార థాలీ ధర మాత్రం 1 శాతం పెరిగింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల వంట నూనెల ధరలు కూడా సమీప భవిష్యత్తులో అధికంగానే ఉండవచ్చని క్రిసిల్ అంచనా వేసింది.
The post టమాటా, నూనెలు, గ్యాస్ ధరల సెగ appeared first on Navatelangana.