మన చుట్టూ వున్న కొందరిలో ఎన్నో కళలు ఉంటాయి. కానీ, అవన్నీ తమలోనే దాచుకుని, ఏదో తెలీని బిడియంతోనో, ఇష్టంలేకనో ముందుకు రాక చాలా కాలం అజ్ఞాతంగానే వుండిపోతారు. ఎవరి గుర్తింపుకూ ఆశించకుండా తమ పనులను తాము ఎంతో నిశ్శబ్దంగా చేసుకుంటూ ఎలాంటి భేషజాలు లేకుండా అత్యంత సామాన్య జీవితం గడిపే అలాంటి ‘అసాధారణ’ వ్యక్తులను సన్మానించాలన్నది నా ఆరాటం. అందుకే అందరి సహకారంతో అపురూప అవార్డులు అందిస్తున్నాం.
ఒక పాటనో, ఓ నృత్యమో, ఓ చిత్రమో, ఓ నాటకమో, ఓ కవితనో, మరో కథనో… విన్నపుడు, చూసినపుడు, చదివినపుడు మనసు సేదతీరి కుదుటపడుతుంది. మరి అలాంటి వాటిని తమ ప్రాణం పెట్టి సృష్టించినవారూ, ప్రదర్శించేవారూ సమాజానికి ఎంతో అవసరం. అలాంటి వారిని గుర్తించడం, కాపాడుకోవడం, ప్రోత్సహించుకోవడం మన ధర్మం. అందుకే ప్రతిభకు పట్టాభిషేకం చేయాలన్నది నా అభిమతం. ప్రతిభావంతులను సత్కరిస్తే, మరెందరో ప్రతిభావంతులు పుట్టుకొస్తారని, తద్వారా మనదేశం మేధావులతో, మనసున్న మనుషులతో సుసంపన్నం అవుతుందన్న భావనతో చంద్రునికో నూలు పోగులా ఈ అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, అందరి అండదండలతో 15 ఏండ్లుగా ఈ పరంపరని కొనసాగిస్తున్నాను. ప్రతియేటా ఒకసారి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకు ఇచ్చే ‘అమతలత జీవన సాఫల్య పురస్కారాల’ను ఈ ఏటితో 32 మంది అందుకున్నారు. ఇదిగాక ప్రతి యేటా నా బంధుమిత్రులందరి సహకారంతో ఉభయ రాష్ట్రాల స్థాయిలో వివిధ రంగాలలో నిష్ణాతులైన స్త్రీలకు ఇస్తోన్న ‘అపురూప పరస్కారాలు’ నేటితో 129 మందికి చేరిందని చెప్పడానికి తోషపడుతున్నాను. అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
– డా.అమతలత
The post ప్రతిభకు పట్టాభిషేకం- అపురూప పురస్కారం appeared first on Navatelangana.