← Back to headlines

ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష

2026-05-09 16:34 • original

అమ్మ అత్తలూరి అనసూయ, నాన్న లక్ష్మీనరసింహారావు. మాది తెనాలి. నాన్న స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్ట్‌. వారికి మేము ఆరుగురం సంతానం. నేను నాలుగవ సంతానాన్ని. నేను ఆరు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడే కుటుంబం హైదరాబాద్‌ వచ్చేసింది. నా విద్యా భ్యాసం అంతా హైదరాబాద్లోనే. నాకు ఊహ వచ్చినప్పుడు అమ్మ జబ్బుతో ఉండేది. ఆ కారణంగా ఇంట్లో పని చేయడం అలవాటు అయింది. అది నాకు తరవాత, తరవాత బాగా పనికి వచ్చింది. నేనెప్పుడూ అమ్మ దగ్గర కూర్చుని ఏ పనీ నేర్చుకోలేదు. అమ్మ చేస్తుంటే సాయం చేస్తూ, ఎలా చేస్తోందో చూసి చేయడం మొదలుపెట్టాను. వంట కూడా అంతే. అమ్మ నాన్నగారి సహచర్యంలో కొంత ఆధునిక భావజాలం ఏర్పరచుకున్నా చిన్నప్పటి నుంచి అలవాటుగా మారిన కొన్ని సంప్రదాయాలను పాటించేది. వయసొచ్చిన ఆడపిల్లగా కొన్ని పరిమితుల మధ్య పెరిగాను. అందుకు కారణం సమాజంలో ఉన్న కొన్ని దుష్టశక్తుల పీడ నా మీద పడకుండా అమ్మ తీసుకున్న జాగ్రత్తలు. ఏ తల్లి అయినా అలాగే చేస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అవి కట్టుబాట్లు కాదు, జీవితంలో ఆటుపోట్లు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి? నన్ను నేను ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలి అనే దానికి ఆమె నిశ్శబ్దంగా ఇచ్చిన శిక్షణ. మా అమ్మ తనకి తెలిసిన కొద్దిపాటి పరిజ్ఞానం నాకు వివరించి, ధైర్యంగా బతకడం నేర్పింది. సమయం వధా చేయకుండా కాలాన్ని ఎలా సద్వినియోగం చేయాలో చెప్పింది. లేమిలోనూ ఎంత ఆత్మగౌరవంతో బతకాలో నేర్పింది. కాబట్టి ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష. అందుకే అమ్మకి జోహారు.

– అత్తలూరి విజయలక్ష్మి, రచయిత

The post ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష appeared first on Navatelangana.